లెజెండ్ అనిపించుకోవాల్సిన హరనాథ్.. చిన్న వయసులోనే ఎలా చనిపోయారు?
on Feb 13, 2025
తెలుగు చలన చిత్ర సీమలో ఎంతో మంది అందాల నటులు తమ అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి నటుల్లో హరనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నటరత్న ఎన్.టి.రామారావు తర్వాత కృష్ణుడు, రాముడు వంటి పౌరాణిక పాత్రల్లో రాణించిన నటుల్లో హరనాథ్ ప్రముఖంగా నిలుస్తారు. సాధారణంగా సినిమాల్లో నటించాలని, హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు, అవకాశాల కోసం ఏళ్ళ తరబడి వేచి చూస్తారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదుగుతారు. కానీ, హరనాథ్ సినీ ప్రస్థానం మాత్రం దానికి భిన్నమైనది. సంపన్నుల కుటుంబంలో పుట్టిన ఆయన అలాంటి కష్టాలు పడలేదు. మొదటి నుంచీ ఆయన కెరీర్ ఉజ్వలంగానే సాగింది. ఆరోజుల్లో ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవాలన్నా, హీరో స్థానాన్ని కాపాడుకోవాలన్నా క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం. ఆ క్రమశిక్షణ హరనాథ్‌లో లోపించడం వల్ల తర్వాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అసలు హరనాథ్ సినీ రంగానికి ఎలా వచ్చారు? హీరోగా ఏ స్థాయికి వెళ్ళారు? తన కెరీర్‌ను చేజేతులా ఎలా నాశనం చేసుకున్నారు? చివరికి చిన్న వయసులోనే మృత్యు ఒడిలోకి ఎలా చేరారు? అనే విషయాలు తెలుసుకుందాం.
1936 సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు హరనాథ్. ఆయన పూర్తి పేరు బుద్దరాజు అప్పల వెంకటరామ హరనాథ్ రాజు. బుద్ధరాజు వరహాలరాజు శ్రీఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథాన్ని రచించారు. ఆయన నటుడు కూడా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. వీరు పిఠాపురం రాజవంశానికి చెందినవారు. స్వతహాగా వీరిది ధనిక కుటుంబం. హరనాథ్ తన విద్యాభ్యాసం రాపర్తి, మద్రాస్‌లలో సాగింది. ఆయన కాలేజీలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచేవారు. ఖరీదైన దుస్తులతోపాటు ఖరీదైన వస్తువులు వాడుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఒక గ్యాంగ్‌ని మెయిన్‌టెయిన్ చేసేవారు. ఇతర గ్యాంగులతో గొడవలకు దిగుతూ కాలేజీ రౌడీగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో హ్యాండ్‌సమ్‌గా ఉండడం వల్ల హరనాథ్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఇవికాక ఆయనకు ఉన్న మరో వ్యాపకం నాటకాలు. ఎంతో ఉత్సాహంగా నాటకాల్లో పాల్గొనేవారు. డిగ్రీ వరకు ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్ని గొడవలు వున్నా నాటకాలు మాత్రం మానేవారు కాదు. హరనాథ్‌కి చిన్నతనం నుంచి పైలట్ అవ్వాలనే కోరిక ఉండేది. కానీ, అతని స్నేహితులు మాత్రం ‘నువ్వు అందంగా ఉంటావు. సినిమాల్లో అయితే రాణిస్తావు’ అని ప్రోత్సహించేవారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఒక సినిమాలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మిత్రుడి ద్వారా హరనాథ్ గురించి తెలుసుకున్న దర్శకుడు గుత్తా రామినీడు తను రూపొందిస్తున్న మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన జమున ఈ సినిమాలో హరనాథ్‌కు జోడీగా నటించారు. అయితే ఆయన మొదట కెమెరా ముందు నిలబడిన సినిమా మాత్రం రుష్యశృంగ.
1959లో హరనాథ్ మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మి విడుదలైన తర్వాత మరి కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే ఎన్.టి.రామారావు సీతారామకళ్యాణం చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ రావణాసురుడి పాత్ర పోషించారు. రాముడి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. తను రావణ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కొత్త నటుడితో రాముడి పాత్ర చేయిస్తే బాగుంటుంది అనుకున్నారు. ఒకరోజు ఎన్టీఆర్ పాండీ బజార్‌లోని ఓ షాపుకి వెళ్లారు. అక్కడ హరనాథ్ కనిపించారు. ‘బ్రదర్.. ఎలా ఉంది మీ సినీ ప్రయాణం’ అని అడిగారు. తను చేస్తున్న సినిమాలకు సంబంధించిన వివరాలు చెప్పారు హరనాథ్. అప్పుడు ఎన్టీఆర్ ఆయన్ని పరిశీలనగా చూసి మా సినిమాలో రాముడి వేషం ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారం రోజులకు హరనాథ్‌ను మేకప్ టెస్ట్‌కి పిలిపించారు. ఆయనతోపాటు మరికొందరు నటులు కూడా ఆ టెస్ట్‌కి వచ్చారు. కానీ, హరనాథ్‌ను ఎంపిక చేశారు ఎన్టీఆర్. పురాణ పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్ ఎంతో నిష్టగా ఉండేవారు. కానీ, హరనాథ్ మాత్రం ఆ నియమాలు పాటించకుండా రాముడి వేషం వేస్తూనే సెట్‌లో సిగరెట్లు తాగే వారు. అది తెలిసి ఎన్టీఆర్ ఎంతో బాధపడి, హరనాథ్‌ని మందలించారు. అయినా తన అలవాటు మానుకోకుండా ఎన్టీఆర్‌కి తెలియకుండా సిగరెట్లు కాల్చేవారు. అయితే సీతారామకళ్యాణంలో రాముడిగా హరనాథ్ చాలా అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ ప్రశంసించారు. హరనాథ్‌ను ఎన్టీఆర్ సోదరుడిగా భావించి ఆదరించేవారు. అతనికి ఎన్నో అవకాశాలు ఇప్పించారు. ఎన్టీఆర్‌తో కలిసి హరనాథ్ నటించిన నాదీ ఆడజన్మే, చిట్టి చెల్లెలు, గుండమ్మకథ, భీష్మ, పల్నాటి యుద్ధం, పాండవ వనవాసం, పుణ్యవతి, కలసిఉంటే కలదు సుఖం వంటి సినిమాలు ఘనవిజయం సాధించాయి. 1961 నుంచి 1972 వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు హరనాథ్. ఆరోజుల్లో జమునతో ఎన్టీఆర్‌కు, ఏఎన్నార్‌కు ఓ వివాదం ఉండేది. ఆ కారణంగా ఆమెతో కలిసి నటించేవారు కాదు. ఆ సమయంలో హరనాథ్ కాంబినేషన్‌లో జమున చేసిన చాలా సినిమా సూపర్‌హిట్ అయ్యాయి. ఈ జంటకు అప్పట్లో చాలా మంచి క్రేజ్ ఉండేది. ఇద్దరూ కలిసి దాదాపు 30 సినిమాల్లో నటించారు. రొమాంటిక్ హీరోగా హరనాథ్ అందర్నీ ఆకట్టుకునేవారు. ఇండస్ట్రీలోని హీరోయిన్లు కూడా ఆయన సరసన నటించాలని ఉవ్విళ్ళూరేవారు.
1959 నుంచి 1972 వరకు హరనాథ్‌కు స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఆయన కెరీర్‌లో 140కిపైగా సినిమాలు చేసినా మొదటి 50 సినిమాల హరనాథ్ వేరు, ఆ తర్వాత కనిపించిన హరనాథ్ వేరు అంటారు. ఆయనకు ఎప్పటి నుంచో మద్యం అలవాటు ఉంది. ఒక దశలో అది ఎక్కువైంది. ఈ విషయంలో ఎవరి మాటా వినేవారు కాదు. మద్యానికి బానిసైన మరో నటుడు ఎస్.వి.రంగారావుతో హరనాథ్‌కు స్నేహం ఉండేది. ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యాన్ని సేవిస్తూ షూటింగులకు ఆలస్యంగా వెళ్ళేవారు. విషయం తెలిసిన దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. ఆ సమయంలోనే హీరోలుగా మంచి పేరు తెచ్చుకుంటున్న కృష్ణ, శోభన్‌బాబులకు ఆ సినిమాలు వెళ్లిపోయేవి. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే హరనాథ్‌కు గౌరవం, భయం ఉన్నాయి. అందుకే హరనాథ్ తీరు గురించి ఎన్.టి.రామారావుకు చేరవేశారు హరనాథ్ సన్నిహితులు. అప్పుడు హరనాథ్‌ని పిలిచి మందలించారు ఎన్టీఆర్. కెరీర్ పట్ల శ్రద్ధ పెట్టమనీ, మద్యానికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. ఆయన చెప్పిన తర్వాత కొన్నాళ్లు మానేసినా ఆ తర్వాత యదావిధిగా తన అలవాటును కొనసాగించారు.
హరనాథ్‌కు ఎన్ని అలవాట్లు ఉన్నా వ్యక్తిగతంగా ఎంతో మంచివాడు అనే పేరు ఉంది. అందుకే ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా అప్పటి హీరోలంతా హరనాథ్‌ను ఎంతో అభిమానించేవారు. ఆయనకి అవకాశాలు తగ్గిపోవడం చూసి తమ బేనర్‌లో నిర్మించే సినిమాల్లో, ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించేవారు. అయినా వాటిని నిలబెట్టుకోలేకపోయారు. 1984 వరకు అప్పుడప్పుడు సినిమాలు చేసిన హరనాథ్ ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమయ్యారు. చివరికి 53 ఏళ్ళ వయసులో 1989 నవంబర్ 1న మద్రాస్‌లో కన్నుమూశారు. ఆయన భార్య పేరు భానుమతీదేవి. ఆమె 2015లో మరణించారు. కుమారుడు శ్రీనివాసరాజు.. పవన్‌కళ్యాణ్‌తో గోకులంలో సీత, ప్రభాస్‌తో రాఘవేంద్ర చిత్రాలు నిర్మించారు. కుమార్తె పద్మజ. ఈమె కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు. అల్లుడు జి.వి.జి.రాజు కూడా నిర్మాతే. తొలిప్రేమ, గోదావరి వంటి సూపర్‌హిట్ చిత్రాలు నిర్మించారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
